ఏలూరు - ఇంగిలిపాకాలంక ఆర్టీసీ బస్సు సర్వీస్ ప్రారంభం

ఏలూరు - ఇంగిలిపాకాలంక ఆర్టీసీ బస్సు సర్వీస్ ప్రారంభం
పి ఆర్ న్యూస్ టుడే : కొల్లేరు పరివాహక ప్రాంత ప్రజల దశాబ్దాల రవాణా కల నెరవేరింది. కైకలూరు నియోజకవర్గ పరిధిలోని మండవల్లి మండలం పెనుమాకలంక గ్రామంలో ఏలూరు నుండి ఇంగిలిపాకాలంక వరకు నూతనంగా కేటాయించిన ఆర్టీసీ బస్సు సర్వీస్‌ను గవర్నమెంట్ అస్యూరెన్స్ కమిటీ చైర్మన్, స్థానిక శాసనసభ్యులు డాక్టర్ కామినేని శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఏపీఎస్‌ఆర్టీసీ విజయవాడ జోన్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడుతో పాటు రవాణా శాఖ అధికారులు పాల్గొనగా, ఎమ్మెల్యే స్వయంగా మొదటి టికెట్ తీసుకుని గ్రామస్థులతో కలిసి బస్సులో ప్రయాణించారు.ఇటీవలే ఈ లంక గ్రామాలకు ఏడు కోట్ల రూపాయిలతో నూతన బీటీ రోడ్డు నిర్మించామని, ఇప్పుడు ప్రజల రవాణా సౌకర్యం కోసం ఆర్టీసీ బస్సును అందుబాటులోకి తీసుకువచ్చామని ప్రజాప్రతినిధులు తెలిపారు. ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని పేర్కొంటూ, ఈ సందర్భంగా ఏపీఎస్‌ఆర్టీసీ ఎండీ సుబ్రహ్మణ్యంతో వీడియో కాల్‌లో మాట్లాడి కొల్లేరు లంక గ్రామాల ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ నూతన ఆర్టీసీ బస్సు సర్వీస్ ఏలూరు నుండి ప్రారంభమై పెద్దఎడ్లగాడి, పెనుమాకలంక మీదుగా ఇంగిలిపాకాలంక వరకు సాగుతుంది. తిరుగు ప్రయాణంలో నందిగామలంక, పెనుమాకలంక, పెద్దఎడ్లగాడి మీదుగా ఏలూరు చేరుకుంటుంది. స్త్రీ శక్తి పథకం విజయవంతంగా ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా ఆర్టీసీ యాజమాన్యానికి అభినందనలు తెలిపిన నాయకులు, ఈ రవాణా సౌకర్యంతో లంక గ్రామాల ప్రజలకు విద్యా, వైద్య, వ్యాపార పరంగా ఎంతో మేలు జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
Comments