ఫోన్ వద్దన్నందుకు ఇల్లు వదిలేసిన బాలుడు

By D M SATISH KUMAR , 20 August 2026
పెందుర్తి

సురక్షితంగా తల్లిదండ్రుల వద్దకు చేర్చిన పెందుర్తి పోలీసులు

ఫోన్ విషయంలో తల్లిదండ్రులు మందలించారని ఇల్లు వదిలి వెళ్లిపోయిన ఓ ఇంటర్మీడియట్ మైనర్ బాలుడిని పెందుర్తి పోలీసులు సురక్షితంగా రక్షించి, తల్లిదండ్రులకు అప్పగించారు.

పోలీసుల కథనం ప్రకారం.. పెందుర్తి పోలీస్ స్టేషన్ పరిధికి చెందిన సదరు బాలుడు ఫోన్ వాడకంపై తల్లిదండ్రులు కోప్పడటంతో మనస్తాపానికి గురై ఈ నెల 10న ఇంటి నుంచి ఎవరికీ చెప్పకుండా వెళ్లిపోయాడు. కుటుంబ సభ్యులు పలు చోట్ల వెతికినా ఫలితం లేకపోవడంతో పెందుర్తి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు ‘బోయ్ మిస్సింగ్’ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

పెందుర్తి ఇన్‌స్పెక్టర్ కె.వి. సతీష్ కుమార్ మార్గదర్శకత్వంలో ఎస్సై డి. శ్రీనివాసరావు ప్రత్యేక బృందంతో గాలింపు చేపట్టారు. పరిసర ప్రాంతాల్లోని సీసీ కెమెరాలు, కమాండ్ కంట్రోల్ సెంటర్ సహాయంతో సాంకేతిక ఆధారాలను పరిశీలించి, బాలుడు ఉన్న ప్రాంతాన్ని గుర్తించారు. ఆర్కే బీచ్ పరిసర ప్రాంతంలో ఉన్న బాలుడిని మంగళవారం అర్ధరాత్రి సురక్షితంగా అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

అనంతరం చైల్డ్ వెల్ఫేర్ కమిటీ (CWC) ఆధ్వర్యంలో బాలుడికి, తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇప్పించి, సమయానుకూలంగా అవగాహన కల్పించిన తర్వాత బాలుడిని కుటుంబ సభ్యులకు అప్పగించారు. బాలుడిని సురక్షితంగా అప్పగించిన పెందుర్తి పోలీసులను కుటుంబ సభ్యులు, స్థానికులు అభినందించారు.

Comments

WhatsApp Share Button