ఆటో మ్యుటేషన్ విధానం ప్రజలకు ఎంతో సౌలభ్యం: శాసనసభలో ప్రభుత్వ విప్ గణబాబు

By Nareshkarri111 , 17 August 2026
విశాఖపట్నం

పి ఆర్ న్యూస్ టుడే : పురపాలక సంస్థల్లో ఆస్తి బదిలీ (మ్యుటేషన్) ప్రక్రియను సులభతరం చేస్తూ ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణలను, మున్సిపల్ చట్ట సవరణ బిల్లును విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు ప్రభుత్వ విప్  గణబాబు అసెంబ్లీ వేదికగా స్వాగతించారు. మున్సిపాల్ కార్పొరేషన్లు, స్పెషల్/సెలక్షన్ గ్రేడ్ మున్సిపాలిటీలతో పాటు అన్ని మున్సిపాలిటీలకు ఈ ఆటో-మ్యుటేషన్ విధానాన్ని విస్తరించడం వల్ల ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని ఆయన పేర్కొన్నారు.

ఎమ్మెల్యే గణబాబు ప్రసంగంలోని ముఖ్యాంశాలు:

సింగిల్ విండో విధానం: సబ్-రిజిస్ట్రార్ కార్యాలయంలో ఆస్తి రిజిస్ట్రేషన్ (క్రయవిక్రయాలు, వారసత్వం, గిఫ్ట్ డీడ్ తదితరాలు) పూర్తయిన వెంటనే, అదే సమయంలో ఆటోమేటిక్‌గా మున్సిపల్ రికార్డుల్లోనూ పన్ను బదిలీ/మ్యుటేషన్ జరిగిపోతుంది. ఒకే చోట, ఒకే సమయంలో రెండు సేవలు అందడం సింగిల్ విండో వ్యవస్థకు నిదర్శనం.

సమయం, శ్రమ, ధనం ఆదా: గతంలో రిజిస్ట్రేషన్ అయ్యాక మ్యుటేషన్ కోసం మున్సిపల్ కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వచ్చేది. నూతన విధానంతో ప్రజలకు సమయం, డబ్బు, శ్రమ ఆదా అవుతాయి.

బకాయిల వసూలు – పురపాలికలకు ఆదాయ రక్షణ:* రిజిస్ట్రేషన్ సమయంలోనే ఆస్తికి సంబంధించిన పాత పన్ను బకాయిలు ఉన్నాయో లేదో స్పష్టత రావడం వల్ల మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు రావాల్సిన బకాయిలు తక్షణమే వసూలై ఆదాయం పెరుగుతుంది.

ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ (Ease of Doing Business): సాధారణ పౌరులతో పాటు వాణిజ్య, వ్యాపార సంస్థలకు ఆస్తుల క్రయవిక్రయ ప్రక్రియలు మరింత సులభతరం అవుతాయి.

పన్నుల విధానంలో ఏకరూపత, పారదర్శకత: గతంలో ఒక్కో మున్సిపల్ కౌన్సిల్ ఒక్కో విధంగా పన్ను రేట్లపై నిర్ణయాలు తీసుకునే పరిస్థితి ఉండేది. ఇప్పుడు ఒకే సమగ్ర పాలసీ ద్వారా పన్నుల విధానాన్ని ఏకీకృతం చేయడం వల్ల ప్రజలకు పూర్తి స్పష్టత, పారదర్శకత లభిస్తాయి.

పాలనలో సంస్కరణలు తీసుకొస్తూ, ప్రజలకు పారదర్శకమైన, వేగవంతమైన సేవలు అందించేందుకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ ఆటో-మ్యుటేషన్ బిల్లును మనస్ఫూర్తిగా సమర్థిస్తున్నామని ఎమ్మెల్యే గణబాబు తెలిపారు. అనంతరం సభ ఈ సవరణ బిల్లును ఏకగ్రీవంగా ఆమోదించింది.

Comments

WhatsApp Share Button