వార్డు ప్లానింగ్ సెక్రటరీ కళ్లముందే ఆకాశాన్నంటుతున్న అక్రమ నిర్మాణం! విశాఖపట్నం (ప్రత్యేక ప్రతినిధి) :
గ్రేటర్ విశాఖపట్నం నగర పాలక సంస్థ పరిధిలో పట్టణ ప్రణాళికా నిబంధనలు (Town Planning Rules) పూర్తిగా అపహాస్యమవుతున్నాయి. వార్డు స్థాయిలో అక్రమ నిర్మాణాలను అరికట్టడానికి నియమించబడిన క్షేత్రస్థాయి అధికారుల పర్యవేక్షణా లోపం, అలసత్వం కారణంగా నగరంలో అక్రమ నిర్మాణాల పరంపర నిరాటంకంగా సాగుతోంది. అల్లిపురం ఎక్స్టెన్షన్ వార్డు పరిధిలోని డోర్ నెం. 49-46-6/A, ప్లాట్ నెం. 03 యందు BA No: 1086/3817/B/Z4/AAM/2025 ద్వారా నగర పాలక సంస్థ కేవలం స్టిల్ట్, గ్రౌండ్ మరియు రెండు అంతస్తుల (Stilt + Ground + 2 Floors) నిర్మాణానికి మాత్రమే అనుమతి మంజూరు చేసింది. అయితే, ఆమోదిత ప్లాన్ పరిమితులను పూర్తిగా భేఖాతరు చేస్తూ, అనుమతి లేని మూడో అంతస్తు (Third Floor) నిర్మాణాన్ని బహిరంగంగా చేపడుతున్నారు.స్థానిక సచివాలయం (కోడ్: 1086127) పరిధిలోనే ప్రత్యక్షంగా ఈ చట్ట ఉల్లంఘన సాగుతున్నా, సదరు సచివాలయ వార్డు ప్లానింగ్ & రెగ్యులేషన్ సెక్రటరీ (WPS) తీవ్ర నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం అనుమానాలకు తావిస్తోంది. రోజూ కళ్లముందే అనుమతి లేని తృతీయ అంతస్తు స్లాబ్ పనులు పూర్తవుతున్నా, క్షేత్రస్థాయిలో తనిఖీలు చేసి నిరోధించాల్సిన సచివాలయ ప్లానింగ్ సెక్రటరీ కన్నుమూసి ఉంచడం వెనుక ఉన్న మంత్రాంగం ఏంటో బోధపడటం లేదు. సచివాలయ వ్యవస్థ ఏర్పడినదే వార్డు స్థాయిలో అక్రమాలను ప్రాథమిక దశలోనే గుర్తించి అరికట్టడానికి అయినప్పటికీ, బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్న ప్లానింగ్ సెక్రటరీ విధి నిర్వహణను విస్మరించి నిష్క్రియాపరంగా ఉండిపోవడం టౌన్ ప్లానింగ్ యంత్రాంగంపై పౌరుల్లో నమ్మకాన్ని సడలిస్తోంది. ఆంధ్రప్రదేశ్ భవన నిర్మాణ నిబంధనలు మరియు AP సివిల్ సర్వీసెస్ ప్రవర్తనా నియమావళి ప్రకారం — పరిమితికి మించిన నిర్మాణాలను ప్రాథమిక దశలోనే గుర్తించి 'స్టాప్ వర్క్' నోటీసులు ఇవ్వాల్సిన ప్రాథమిక బాధ్యత సచివాలయ వార్డు ప్లానింగ్ సెక్రటరీదే. ఈ బహిరంగ అక్రమ నిర్మాణంపై ఉన్నతాధికారులు మరియు టౌన్ ప్లానింగ్ విభాగాలు స్పందించి, విధి నిర్వహణలో ఘోరంగా విఫలమైన వార్డు ప్లానింగ్ సెక్రటరీపై కఠినమైన శాఖాపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు, ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ కార్పొరేషన్ చట్టం సెక్షన్ 452, 461 మరియు 636 కింద సదరు అక్రమ అదనపు అంతస్తును నిర్దాక్షిణ్యంగా కూల్చివేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
Comments