మల్కాపురం : మహిళా సాధికారత సాధించినప్పుడే సమాజం, దేశం పురోగమిస్తాయని పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యుడు, ప్రభుత్వ విప్ పి.జి.వి.ఆర్. నాయుడు (గణబాబు) అన్నారు. మల్కాపురంలోని సెయింట్ ఆన్స్ మహిళా డిగ్రీ కళాశాల 50 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహించిన స్వర్ణోత్సవ వేడుకలకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలనం చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 50 ఏళ్లుగా నాణ్యమైన విద్య, సేవాభావం, నైతిక విలువలతో మహిళలను తీర్చిదిద్దుతున్న సెయింట్ ఆన్స్ విద్యాసంస్థల కృషి అభినందనీయమని కొనియాడారు. కేవలం మార్కులు మాత్రమే కెరీర్‌ను ఇస్తాయని, నైతిక విలువలే జీవితానికి సరైన అర్థాన్ని ఇస్తాయని స్పష్టం చేశారు. విద్య జ్ఞానాన్ని అందిస్తే, ఉన్నత వ్యక్తిత్వం సమాజంలో గౌరవాన్ని తెచ్చిపెడుతుందన్నారు. మహిళలు ఎవరిపైనా ఆధారపడకుండా ఆత్మవిశ్వాసంతో తమను తాము బలంగా తీర్చిదిద్దుకోవాలని, వైఫల్యాలకు భయపడకుండా వాటిని విజయానికి తొలిమెట్లుగా మలచుకోవాలని పిలుపునిచ్చారు. క్రమశిక్షణ, సమయపాలన, నాయకత్వ లక్షణాలను అందించడంలో మిషనరీ సంస్థలు ఎల్లప్పుడూ ముందుంటాయని, తన విద్యాభ్యాసం కూడా అలాంటి వాతావరణంలోనే సాగిందని గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో సుపీరియర్ జనరల్ రెవ్. సిస్టర్ పౌలిన్ అగస్టీన్, రెవ్. సిస్టర్ షాలిని, కాలేజీ ప్రిన్సిపాల్ సిస్టర్ ప్రేమ, జూనియర్ కాలేజీ ప్రిన్సిపాల్ సిస్టర్ క్యాథరిన్, డీవీఈవో పి. ఉమారాణి, ఆర్‌ఐవో పి. మురళీధర్, అధ్యాపక బృందం, పూర్వ విద్యార్థినులు, విద్యార్థినులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. వేడుకల్లో భాగంగా విద్యార్థినులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.
Comments