అనుమతి నివాసానికి.. నిర్మాణం షాపులకు! టౌన్ ప్లానింగ్ పర్యవేక్షణలోనే పక్కా కుంభకోణం!

By D M SATISH KUMAR , 24 August 2026
పద్మనాభ నగర్

కమర్షియల్' అక్రమ నిర్మాణాల వెనుక బహుళ స్థాయి ముడుపులు!

92 వార్డ్ ఎస్సీ బీసీ కాలనీ, నాగేంద్ర కాలనీ సచివాలయం (1086458) , పద్మనాభనగర్ టిడ్కో హౌసెస్ ఎదురుగా ఉన్న రోడ్డు పక్కన అక్రమ నిర్మాణాల పర్వం నిరాటంకంగా సాగుతోంది. నివాస భవనాల కోసం (రెసిడెన్షియల్) ప్లాన్ అనుమతులు పొంది, క్షేత్రస్థాయిలో ఏకంగా కమర్షియల్ షాపులు నిర్మిస్తున్నప్పటికీ సంబంధిత వార్డు ప్లానింగ్ సెక్రటరీతో పాటు టౌన్ ప్లానింగ్ అధికారులు పట్టించుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది.

ఒక బిల్డింగ్‌కు ఒక నిబంధన, మరో బిల్డింగ్‌కు మరో పద్ధతి అన్నట్లుగా వార్డు ప్లానింగ్ సెక్రటరీ వ్యవహరిస్తున్న తీరు తీవ్ర చర్చనీయాంశమైంది. కనీస పత్రాలు (పట్టాలు) లేకపోయినా, రోడ్డు స్థలాలను ఆక్రమించి, వాకెంట్ ల్యాండ్ ట్యాక్స్ (VLT) కూడా చెల్లించకుండా యథేచ్ఛగా కమర్షియల్ నిర్మాణాలు వెలుస్తున్నా అడ్డుకోవాల్సిన అధికారే స్వయంగా చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. ఇటీవల ప్లాన్‌కు విరుద్ధంగా ఉన్న కొన్ని నిర్మాణాలపై కూల్చివేతల (డెమోలిషన్) చర్యలు చేపట్టిన అధికారులు, ఇదే రోడ్డులో జరుగుతున్న కమర్షియల్ షాపుల నిర్మాణాల వైపు కన్నెత్తి కూడా చూడకపోవడం గమనార్హం.

వార్డు ప్లానింగ్ సెక్రటరీ స్థాయి నుంచి టీపీబీవో (TPBO), ఏసీపీ (ACP) వరకు టౌన్ ప్లానింగ్ అధికారుల అందరి కనుసన్నల్లోనే ఈ అక్రమాలు జరుగుతున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అక్రమ నిర్మాణాలపై స్థానికులు ఎవరైనా ప్రశ్నిస్తే లేదా నిలదీస్తే.. "ఎక్కడైనా కంప్లైంట్ పెట్టుకోండి, పైస్థాయిలో మేమే క్లోజ్ చేసుకుంటాం" అంటూ అత్యంత నిర్లక్ష్యంగా, బాధ్యతారాహిత్యంగా సమాధానం ఇస్తున్నట్లు స్థానికులు వాపోతున్నారు. కిందిస్థాయి అధికారులకు తగిన అండదండలు ఉండటం వల్లే నిబంధనలను తుంగలో తొక్కుతూ ఈ అక్రమ నిర్మాణాలు కొనసాగుతున్నాయి. నిబంధనలను నీరుగారుస్తూ ప్రభుత్వ రాబడికి గండి కొడుతున్న ఈ అక్రమ కమర్షియల్ నిర్మాణాలపై జీఎంసీ కమిషనర్ మరియు టౌన్ ప్లానింగ్ ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి విచారణ జరపాలని స్థానికులు కోరుతున్నారు.

 

Comments

WhatsApp Share Button