వరలక్ష్మీ వ్రతం షాపింగ్‌కు వెళ్తున్నారా? గాజువాక పోలీసుల హెచ్చరికలు

By D M SATISH KUMAR , 20 August 2026
గాజువాక

గాజువాక. వరలక్ష్మీ వ్రతం పండుగ సందర్భంగా ఆలయాలు, మార్కెట్లలో రద్దీ పెరిగే అవకాశం ఉండటంతో దొంగతనాలు, చైన్ స్నాచింగ్‌లను అరికట్టేందుకు విశాఖ సౌత్ సబ్ డివిజన్ క్రైమ్ పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. పండుగ పూట ప్రజల భద్రతే లక్ష్యంగా గాజువాక పరిధిలోని ప్రధాన రహదారులు, రద్దీ కూడళ్లలో క్రైమ్ ఇన్‌స్పెక్టర్ జి.డి. బాబు, ఎస్సై హరికృష్ణల ఆధ్వర్యంలో పోలీసు బృందాలు విస్తృతంగా నాకాబందీ మరియు వాహన తనిఖీలు నిర్వహించాయి.

ఈ తనిఖీల్లో భాగంగా అనుమానాస్పదంగా సంచరిస్తున్న వ్యక్తులను, పత్రాలు మరియు నంబర్ ప్లేట్లు లేని వాహనాలను పోలీసులు తీవ్రంగా తనిఖీ చేశారు. పండుగ షాపింగ్ కోసం మహిళలు బంగారు ఆభరణాలు ధరించి బయటకు వచ్చేటప్పుడు చైన్ స్నాచర్లు మరియు దృష్టి మళ్లించే ముఠాల పట్ల అత్యంత అప్రమత్తంగా ఉండాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు. వాహనదారులు తమ వాహనాలను ఎక్కడపడితే అక్కడ నిలపకుండా సురక్షితమైన ప్రదేశాల్లోనే పార్క్ చేసి తప్పనిసరిగా లాక్ చేసుకోవాలని సూచించారు.

రద్దీ ప్రాంతాల్లో ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. నేరం జరిగిన తర్వాత స్పందించడం కంటే, నేరం జరగకుండా ముందస్తుగా అడ్డుకోవడమే తమ ప్రధాన లక్ష్యమని క్రైమ్ పోలీసులు స్పష్టం చేశారు.

Department

Comments

WhatsApp Share Button